’సాహో’రె బాహుబలి…! సంచలనం విజయం సాధించిన ’బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో. ఆ మూవీలో ప్రభాస్ ‘ఫస్ట్ లుక్’ను సోమవారం విడుదల చేశారు. అయితే, అది ఎంత మాత్రం ఫస్ట్ లుక్ లా లేదు. హాలీవుడ్ సినిమా బ్లేడ్ రన్నర్ 2049 పోస్టర్ కు అనుకరణలా కనిపిస్తోంది. అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ’ఫస్ట్ లుక్’ను విడుదల చేయనున్నట్టు సినిమా దర్శకుడు సుజీత్ ఆదివారమే ట్విట్టర్లో ప్రకటించారు. అప్పటినుంచి అభిమానులు ఎదురు చూస్తున్నారు.
బాహుబలి తర్వాత పెరిగిన ప్రభాస్ ఇమేజితో ’సాహో’పై అంచనాలు ఆకాశాన్నంటాయి. సుమారు రూ. 150 కోట్ల బడ్జెట్ అంచనాతో తెలుగు, హిందీలలో ఏక కాలంలో నిర్మిస్తున్న చిత్రం సాహో. ఈ యాక్షన్ థ్రిల్లర్ లో ప్రభాస్ కు జోడీగా శ్రద్ధా కపూర్ నటిస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్ అదిరిపోతుందని ప్రభాస్ అభిమానులంతా ఆశించారు. అనుకున్నట్టే దర్శక నిర్మాతలు ప్రభాస్ పుట్టిన రోజున ’ఫస్ట్ లుక్’ను విడుదల చేశారు. సినిమా నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ షేర్ చేయగానే.. కొత్తగా చూసినవారికి అది చాలా బాగున్నట్టు అనిపించింది. అంతే.. ప్రభాస్ పై ప్రశంసలు కురిపిస్తూ సామాజిక మాథ్యమాల్లో వేగంగా షేర్ చేశారు. దీంతో ట్విట్టర్ లో టాప్ ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది.
అయితే, హాలీవుడ్ సినిమాలను ఫాలో అయ్యేవారికి ఎక్కడో చిన్న సందేహం వచ్చింది. ఇంకేముంది… గూగుల్ కు పని చెప్పి హాలీవుడ్ పోస్టర్లు వెలికి తీశారు. సాహో దర్శకుడు అక్కడే దొరికిపోయాడు. హాలీవుడ్ మూవీ బ్లేడ్ రన్నర్ పోస్టర్ కు, సాహో ’ఫస్ట్ లుక్’ దాదాపు నకలులానే ఉంది. ప్రభాస్ స్థానంలో బ్లేడ్ రన్నర్ 2049 హీరో ర్యాన్ గోస్లింగ్ కనిపించాడు. ఆ మూవీ పోస్టర్లో ర్యాన్ కనిపించినట్టే సాహో ’ఫస్ట్ లుక్’లో ప్రభాస్ దర్శనమిచ్చాడు.
నల్లని లాంగ్ కోటు, ముక్కువరకు కప్పి ఉంచే ముసుగు.. సేమ్ టు సేమ్. ఒకే ఒక్క తేడా.. బ్లేడ్ రన్నర్ పోస్టర్ లో ర్యాన్ రెండు చేతులూ కోటు జేబుల్లో పెట్టుకుంటే సాహో ప్రభాస్ ఒక్క చేయి మాత్రమే కోటు జేబులో పెట్టుకుని మరో చేత్తో ఫోన్ మాట్లాడుతుంటాడు. బ్యాక్ గ్రౌండ్ మాత్రం మార్చేశారు. అది కూడా బ్లేడ్ రన్నర్ మరో పోస్టర్ ను పోలి ఉంది. దీంతో.. బ్లేడ్ రన్నర్ లోని రెండు పోస్టర్లను మిక్సీలో వేసి తీసి సాహో ’ఫస్ట్ లుక్’ అన్నారని ట్విట్టర్ లో కామెంట్లు వచ్చాయి.
తెలుగు సినిమాల్లో అనుకరణ సీన్లు, పోస్టర్లు, ఫైట్లు కొత్త కాదు. అయితే, ముందే చెప్పుకున్నట్టు భారీ అంచనాల నడుమ ప్రభాస్ పుట్టిన రోజున విడుదలైన సాహో ‘ఫస్ట్ లుక్’ కథ కాస్త భిన్నమైనది. #HBDDarlingPrabhas, #Prabhas, #SaahoFirstLook హ్యాష్ ట్యాగులతో అభిమానులు ట్విట్టర్ ను హోరెత్తించారు. ఫస్ట్ లుక్ కాపీ అని తెలిసిన వారు ఉసూరుమన్నారు. 150 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మాణం తలపెట్టిన నిర్మాతలు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేదని వారు అభిప్రాయపడ్డారు.