మళ్ళీ ’ప్రత్యేక’ నినాదం… చివరి అస్త్రంగా రాజీనామాలకు సిద్ధమన్న జగన్

1 0
Read Time:5 Minute, 23 Second
  • అనంతపురంలో వైసీపీ యువభేరి…
  • ఆర్నెల్ల విరామం తర్వాత నిర్వహణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ’ప్రత్యేక కేటగిరి హోదా’ కావాలన్న నినాదం మళ్ళీ ముందుకొచ్చింది. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం అనంతపురంలో నిర్వహించిన యువభేరి సారాంశమే ’ప్రత్యేక హోదా’గా ఉంది. అనంతపురంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో విద్యార్ధులతో ముఖాముఖిలో జగన్ పాల్గొన్నారు. ఆర్నెల్ల విరామం తర్వాత యువభేరి కార్యక్రమాలను పునరుద్ధరించిన జగన్, యువత అందరి సహకారంతోనే ప్రత్యేక హోదా సాధ్యమని ఉద్ఘాటించారు.

ఇది ఒక్క జగన్‌మోహన్‌రెడ్డి వల్ల మాత్రమే సాధ్యమయ్యే పని కాదు. మీ అందరి మద్దతు కావాలి. అందరం కలసికట్టుగా పోరాటం చేస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యమే. అవసరమైతే చివరి అస్త్రంగా ఎంపీల చేత రాజీనామా కూడా చేయిస్తా

ప్రత్యేక హోదాపై తొలినుంచీ పోరాటం చేసింది తానేనని చెప్పిన జగన్, తాను విరామం ఇచ్చిన రోజుల్లో కూడా ఎవరూ ఆ అంశంపై మాట్లాడలేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాకోసం పోరాటం కొనసాగిస్తామని ప్రకటించిన జగన్, మాట ఇచ్చి తప్పారంటూ ప్రత్యక్షంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును… పరోక్షంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడులను విమర్శించారు. 2014 ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చిన పెద్ద మనుషులు ఆ తర్వాత వాటిని తుంగలో తొక్కారని జగన్ మండిపడ్డారు. అయితే, ముఖ్యమంత్రిపైనే ప్రధానంగా జగన్ తన విమర్శలను ఎక్కుపెట్టారు. విద్యార్ధులతోనూ మాట్లాడించారు.

విభజన సమయంలో కేంద్రం హామీ ఇచ్చినట్టుగా ఐదేళ్ళపాటు ప్రత్యేక హోదా సరిపోదని, 15 ఏళ్ళపాటు కావాలని డిమాండ్ చేసిన చంద్రబాబు… ఎన్నికల తర్వాత మాట మార్చారని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా సంజీవని కాదంటూ… ప్యాకేజీ బెటరని మాట్లాడారని ఆక్షేపించారు. 14వ ఆర్థిక సంఘం ప్రకారం ఇక ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఉండదంటూ చంద్రబాబు మరో అబద్ధం చెప్పారని, చంద్రబాబు తన స్వార్ధంకోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని జగన్ ధ్వజమెత్తారు.

ఇదివరకే ప్రత్యేక హోదా ఉన్న 11 రాష్ట్రాలకు అది కొనసాగుతోందన్న జగన్… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం హోదాగానీ, దానికి ప్రత్యమ్నాయంగా వస్తాయనుకున్న ప్యాకేజీ ప్రయోజనాలు గానీ రాలేదని పేర్కొన్నారు. దేశ జనాభాలో హోదా ఉన్న 11 రాష్ట్రాల వాటా కేవలం 6.2 శాతం కాగా… గత మూడేళ్ళలో మొత్తం రాష్ట్రాలకు ఇచ్చిన నిధుల్లో ఆయా రాష్ట్రాల వాటా 14.06 శాతంగా ఉందని జగన్ చెప్పారు. ఆ దామాషాలో చూస్తే రూ. 86,686 కోట్లు రావలసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేవలం రూ. 44,747 కోట్లు మాత్రమే వచ్చాయన్నారు.

హోదాతో వచ్చే ప్రత్యేక రాయితీల కారణంగా పరిశ్రమలు వస్తాయన్నారు. అనంతపురం వంటి వెనుకబడిన జిల్లాలకు హోదా వరమయ్యేదన్నారు. ఏపీకి హోదా వచ్చి ఉంటే ఈ మూడున్నరేళ్ళలోనే లక్షల ఉద్యోగాలు వచ్చేవని జగన్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు, జగన్ ముఖాలు చూసి రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టబోరని, హోదాతో వచ్చే రాయితీలతోనే పరిశ్రమలు వస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నా, ఉపాధి అవకాశాలు పెరగాలన్నా ప్రత్యేక హోదా తప్పనిసరి అని జగన్ ఉద్ఘాటించారు.

గత మూడున్నరేళ్ళలో హోదాకోసం అనేక ప్రయత్నాలు చేశామని, 10 జిల్లాల్లో యువభేరీలు నిర్వహించామని జగన్ చెప్పారు. తాను నవంబర్ 2వ తేదీనుంచి ఆర్నెల్లపాటు పాదయాత్ర చేయబోతున్నానని, ఆ సందర్భంగా హోదాకోసం మద్ధతు కూడగడతానని పేర్కొన్నారు.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply