సహనశీలి అంత్యక్రియల సందర్భంలోనూ అసహనమే…!

వాజ్ పేయికి నివాళి అర్పించేందుకు వచ్చిన అగ్నివేష్ పై బీజేపీ కార్యకర్తల దాడి

మత రాజకీయాల విద్వేషం మరోసారి విచక్షణ కోల్పోయింది. ఎక్కడ.. ఏం చేస్తున్నామన్న ఇంగితం మరచిపోయింది. మాజీ ప్రధానమంత్రి వాజ్ పేయి అంత్యక్రియలకు ముందు నివాళి అర్పించడానికి వచ్చిన సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్ దాడికి గురయ్యారు. సహనశీలిగా పేరొందిన వాజ్ పేయి పార్టీకి చెందిన కార్యకర్తలే… అదీ ఆయన భౌతిక కాయం ఉంచిన పార్టీ కార్యాలయం ఎదుటే దాడి చేయడం కలకలం రేపింది. ఢిల్లీలోని దీన్ దయాళ్ మార్గ్ లో బీజేపీ కార్యాలయం వెలుపల ఈ ఘటన చోటు చేసుకుంది.

వాజ్ పేయికి నివాళులు అర్పించేందుకు అగ్నివేష్ ఆ మార్గంలో నడుచుకుంటూ వస్తుండగా బీజేపీ కార్యకర్తలు గుంపుగా ఆయన వెంటపడ్డారు. వారిలో కొందరు అగ్నివేష్ పై చేయి చేసుకున్నారు. బీజేపీ కార్యకర్తలు అగ్నివేష్ ను వెకిలి వ్యాఖ్యానాలతో ధూషించారు. ఈ దాడి సందర్భంలో సెల్ ఫోన్ తో తీసిన ఓ వీడియో క్లిప్పింగ్ ను ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక ట్వీట్ చేసింది. అగ్నివేష్ ను తోసివేయడం, ఓ మహిళ చెప్పు తీసుకొని వెంటబడటం ఆ వీడియోలో చూడవచ్చు.

నెల రోజుల వ్యవధిలో అగ్నివేష్ పై దాడి జరగడం ఇది రెండోసారి. గత నెలలో బీజేపీ యువజన విభాగం కార్యకర్తలు అగ్నివేష్ పై దాడి చేయగా… శుక్రవారం బీజేపీ కార్యకర్తలు వారి కేంద్ర కార్యాలయం ఎదుటే దాడికి పాల్పడ్డారు. మోడీ ప్రభుత్వంపైన, ఆరెస్సెస్ పైనా విమర్శలు చేస్తున్న నాయకులు, సామాజిక కార్యకర్తలపై దాడులు జరగడం కొత్త కాకపోయినా… వాజ్ పేయి అంతిమ సంస్కార ఘడియల్లోనూ అలాంటి ఘటన చోటు చేసుకోవడం బీజేపీకి మచ్చ తెచ్చేలా ఉంది.

గత నెలలో జార్ఖండ్ లో ఓ గిరిజన తెగకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళిన అగ్నివేష్ పై లిట్టిపార స్టేడియం వద్ద బీజేవైఎం కార్యకర్తలు దాడి చేశారు. అగ్నివేష్ ఆ కార్యక్రమంలో ఉండగా బయట బీజేవైఎం, ఏబీవీపీ కార్యకర్తలు నిరసన తెలుపుతున్నారన్న సమాచారం అందింది. వారికి ఉన్న అభ్యంతరాలపై చర్చించడానికి తాను సిద్ధమని అగ్నివేష్ తెలియజేసినా వారు అందుకు సిద్ధపడలేదు. అనంతరం అగ్నివేష్ పై దాడి జరిగింది. స్వల్ప గాయాలతో అగ్నివేష్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం మరోసారి దాడి జరగడం చర్చనీయాంశమైంది. అగ్నివేష్ వెంటపడిన వారు ‘భారత్ మాతాకీ జై’, ‘దేశ్ ద్రోహి వాపస్ జావో’ వంటి నినాదాలు చేశారు. ఆరెస్సెస్ నుంచే వచ్చిన వాజ్ పేయి రాజకీయ ప్రత్యర్ధులపైనా గౌరవంతో మెలిగారు. సహనంతో సమస్యల పరిష్కారానికి ప్రయత్నించారు. విద్వేషపూరిత చర్యలను వ్యతిరేకించారు. అలాంటి సహనశీలిని గౌరవంగా, ఘనంగా సాగనంపవలసిన బీజేపీ కార్యకర్తలు.. భిన్నాభిప్రాయాలున్నాయన్న కారణంతో అగ్నివేష్ పై దాడి చేసి అసహన రాజకీయాలతో వీడ్కోలు పలికినట్టయింది.

Related posts