’ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమంలో భాగంగా తమ పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు ఇప్పటికే రాష్ట్రంలో 60 లక్షల ఇళ్ళకు వెళ్ళినట్టు తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. మొత్తంగా 1.39 కోట్ల ఇళ్ళకు వెళ్ళి ప్రజలను కలవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ టీడీపీ బలంగా ఉండాలి.. గెలవాలన్నదే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. ఆర్థిక కష్టాలున్నా ఏ విషయంలోనూ ప్రజలకు ఇబ్బంది రాకుండా ప్రభుత్వం కష్టపడి పని చేస్తోందన్న సిఎం… ప్రజలు మద్ధతు ఇవ్వాలని విన్నవించారు.
టీడీపీ నాయకులు వచ్చినప్పుడు ఆశీర్వదించండి. మీ సమస్యలు చెప్పండి. పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా – సిఎం
రాష్ట్ర విభజన సమయంలో 25 మిలియన్ యూనిట్ల మేరకు విద్యుత్ కొరత ఉందని, ఇదే విధంగా ఉన్న సమస్యలను అధిగమించి సంక్షేమ కార్యక్రమాలను పెంచామని సిఎం చెప్పారు. ఆర్థిక కష్టాలున్నా, అప్పులపై ఎఫ్ఆర్బీఎం పరిమితి ఉన్నా వెరవకుండా రైతు రుణ మాఫీని చేపట్టామన్నారు. ఇప్పుడు యుపి, మహారాష్ట్ర మనల్ని ఫాలో అయ్యారని సిఎం వ్యాఖ్యానించారు.