విభజన హామీలపై లోక్ సభలో ప్రైవేటు మెంబర్ బిల్లులు

2 0

హామీల అమలుపై సవరణ బిల్లును ప్రవేశపెట్టిన గల్లా జయదేవ్

విశాఖ రైల్వే జోన్ పై ప్రత్యేక బిల్లు పెట్టిన రామ్మోహన్ నాయుడు

రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై అధికార తెలుగుదేశం పార్టీ దృష్టి సారించింది. ఇందుకు సంబంధించి అధికార పార్టీ ఎంపీలు శుక్రవారం ఒకే రోజు రెండు ప్రైవేటు మెంబర్ బిల్లులను లోక్ సభలో ప్రవేశపెట్టారు. రాష్ట్ర విభజన హామీలను అమలు చేేసే విషయమై గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, విశాఖ రైల్వే జోన్ విషయమై శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు వేర్వేరుగా బిల్లులను ప్రవేశపెట్టారు. తదుపరి పార్లమెంటు సమావేశాల్లో... ఈ అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు.

రాష్ట్ర విభజన జరిగిన మూడున్నరేళ్ళు గడచినా ఇంతవరకు హామీలు అమలు కాకపోవడం, కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ అరకొరగా అమలు కావడం నేపథ్యంలో టీడీపీ ఆయా అంశాలపై పార్లమెంటులో చర్చకు పావులు కదిపింది. అందులో భాగంగానే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అంశాల అమలు, ఇతర హామీలకు సంబంధించి చట్టంలో చేయవలసిన సవరణలను గల్లా జయదేవ్ తన బిల్లులో పేర్కొన్నారు. రామ్మోహన్ నాయుడు పునర్వ్యవస్థీకరణ చట్టంలో హామీ ఇచ్చిన విధంగా రైల్వే జోన్ ఏర్పాటుకు మరో బిల్లును ప్రతిపాదించారు. ఇందుకోసం 1989 రైల్వే చట్టానికి సవరణను కోరారు.

రాష్ట్ర విభజన జరిగి మూడున్నర సంవత్సరాలైనా హామీల అమలుపై కేంద్రం నుంచి సరైన సమాధానం రానందుకే తాము ఈ బిల్లులను ప్రవేశపెట్టినట్టు రామ్మోహన్ నాయుడు విలేకరులకు చెప్పారు. రైల్వే డివిజన్ హామీపై ప్రస్తుత రైల్వే మంత్రితోపాటు పూర్వ మంత్రులు, ప్రధానమంత్రి అందరికీ తెలుసని, అయినా రాజకీయ నిర్ణయం తీసుకోవడంలేదని రామ్మోహన్ నాయుడు ఆక్షేపించారు. హామీలను అమలు చేయవలసిన అవసరంపై సభలో చర్చ జరగాలన్న ఉద్దేశంతోనే ప్రైవేటు మెంబర్ బిల్లును పెట్టానని ఆయన చెప్పారు. చర్చకు వచ్చినప్పుడు రైల్వే డివిజన్ విషయంలో రాష్ట్రంలో ఉన్న సెంటిమెంట్ ను చెబుతామని, కేంద్రంపై ఒత్తిడి తెస్తామని పేర్కొన్నారు.