ఆస్ట్రేలియా-ఇండొనేషియా ఎయిర్ ఏషియా విమానంలో భయానక వాతావరణం..
34 వేల అడుగులనుంచి 10 వేల అడుగులకు పడిపోయిన క్యుజడ్535
వేల అడుగుల ఎత్తునుంచి ఓ విమానం భూమివైపు నిట్టనిలువునా దూసుకు రావడం చూసినవారున్నారా? అలాంటి ఒక అనుభవాన్ని చవిచూసి బతికి బయటపడినవారున్నారా? ఈ రెండు ప్రశ్నలకూ లేదనే సమాధానమే వస్తుంది. అలాంటి ఒళ్ళు గగుర్పొడిచే ద్రుశ్యాలను హాలీవుడ్ సినిమా తెరపై మాత్రమే చూసిన కొందరు ప్రయాణీకులు తాజాగా ప్రత్యక్షంగా అనుభవించారు. సెలవును ఎంజాయ్ చేద్దామని ఓ ఐలాండ్ కు బయలుదేరినవారికి గాల్లోనే టెర్రర్ కనిపించింది.
ఆదివారం ఆస్ట్రేలియా నుంచి ఇండొనేషియాలోని బాలికి బయలుదేరిన ఎయిర్ ఏషియా విమానం క్యుజడ్535 మార్గమధ్యంలో అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంది. భూమికి 34,000 అడుగుల (10,363 మీటర్ల) ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో కేబిన్ లో గాలి పీడనం తగ్గిపోయి 10,000 అడుగుల (3,048 మీటర్ల)కు చాలా వేగంగా దిగిపోయింది. తొమ్మిది నిమిషాల ప్రయాణ సమయంలోనే 23,800 అడుగుల మేరకు దిగిపోవడం విమానంలో భయానక వాతావరణానికి కారణమైంది.
విమాన సిబ్బంది హెచ్చరికలు జారీ చేయడం.. వెనువెంటనే ఆక్సిజన్ మాస్కులు సీలింగ్ నుంచి జారిపడటంతో ప్రయాణీకులు వణికిపోయారు. విమానంలో 145 మంది ప్రయాణీకులకు తోడు పైలట్లు, సిబ్బంది ఉన్నారు. ఈ సంఘటన కారణంగా విమానం గమ్య స్థానంవైపు నుంచి వెనక్కు మళ్ళి ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరంలో దిగింది. బయలుదేరిన తర్వాత 78 నిమిషాలకు తిరిగి విమానం ల్యాండ్ అయింది.
సాంకేతిక సమస్య కారణంగా ప్రయాణీకుల ప్రాణాలను కాపాడటంకోసం విమానాన్ని కిందకు దించవలసి వచ్చిందని పైలట్ తర్వాత చెప్పాడు. విమానాన్ని క్షేమంగా కిందకు దించినందుకు ఎయిర్ ఏషియా సంస్థ పైలట్లను అభినందించింది. విమానం దిగిన తర్వాత ప్రయాణీకులు తమ అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. జరిగిన సంఘటనకు తోడు సిబ్బంది ప్రవర్తన తమను మరింత భయపెట్టిందని కొందరు వాపోయారు. విమాన సిబ్బంది గట్టిగా అరుస్తూ కళ్ళ నీళ్ళు పెట్టకోవడం, షాక్ లో ఉండటం తాము చూశామని ఒక క్లేర్ ఆస్క్యూ అనే ప్రయాణీకురాలు చెప్పారు.
గత జూన్లో పెర్త్ నుంచి కౌలాలంపూర్ బయలుదేరిన ఎయిర్ ఏషియా విమానం (మలేషియాకు చెందినది) ఇంజన్ విఫలం కావడం వల్ల తిరిగి వచ్చింది. అప్పుడు కూడా విమాన సిబ్బందిలో ఒకరు ప్రయాణీకులతో ’దేవుడిని ప్రార్ధించుకోండి’ అని చెప్పడం విమర్శలకు తావిచ్చింది. 2014 డిసెంబర్ మాసంలో ఇండోనేషియా నగరం సురబయ నుంచి సింగపూర్ బయలుదేరిన విమానం ఒకటి జావా సముద్రంలో కూలిపోయింది. దీంతో 162 మంది మరణించారు.