దేశంపై నిరుద్యోగ భూతం పడగ…! 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత సమస్య

5 0

2017-18లో 27.2 పట్టణ యువతులు నిరుద్యోగులు

గ్రామీణ యువకుల్లో 17 శాతానికి ఉపాధి లేదు

మోడీ ప్రభుత్వం దాచిపెట్టిన సమాచారం పత్రికల్లో వెల్లడి

డీమానెటైజేషన్, జీఎస్టీల వల్ల ఆర్థిక వ్యవస్థ... ముఖ్యంగా అసంఘటిత రంగం కుదేలైనా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రం అంగీకరించడానికి నిరాకరిస్తున్నారు. పైగా తన చర్యల వల్ల దేశానికి చాలా మేలు జరిగిందని వాదిస్తూ వస్తున్నారు. దేశంలో వాస్తవ పరిస్థితులు ఈ వాదనకు భిన్నంగా ఉన్నాయి.

నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీసు (ఎన్.ఎస్.ఎస్.ఒ) తాజా సర్వే ప్రకారం దేశంలో నిరుద్యోగం రేటు పతాక స్థాయికి చేరింది. 2017-18లో స్థూల నిరుద్యోగ రేటు 6.1గా ఉంది. ఇది గత 45 సంవత్సరాల్లో అత్యధికం. 2011-12లో నిరుద్యోగం రేటు 2.2 శాతం. ప్రస్తుతం దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రతకు పై రెండు అంకెలు దర్పణం పడుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం రేటు అత్యధికంగా 7.8 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది 5.3 శాతం.

యువత వరకు తీసుకుంటే... నిరుద్యోగ సమస్య అసాధారణ స్థాయికి చేరింది. 15 నుంచి 29 సంవత్సరాల వయసున్న పట్టణ యువకులలో నిరుద్యోగం 18.7 శాతం ఉంటే... పట్టణ యువతులలో ఏకంగా 27.2 శాతానికి పెరిగింది. గ్రామీణ యువకులలోనూ 17 శాతం నిరుద్యోగం ఉంటే... గ్రామీణ యువతులలో 13.6 శాతం నమోదైంది.

ఎన్ఎస్ఎస్ఒ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పిఎల్ఎఫ్ఎస్)లో నిరుద్యోగ సమస్య తీవ్రత వెల్లడైంది. ఉపాదిలో ఉన్నవారి సంఖ్య గత సంవత్సరాలతో పోలిస్తే గణనీయంగా తగ్గినట్టు తేలింది.

ఉపాధి సమాచారాన్ని ఇప్పుడున్న పద్ధతుల్లో గణించడం మొదలుపెట్టిన (1972-73) తర్వాత నిరుద్యోగం రేటు ఈ స్థాయిలో ఎప్పుడూ నమోదు కాలేదు. మధ్యలో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభాలు వచ్చినా, జీడీపీ వృద్ధి రేటు తగ్గినా నిరుద్యోగం రేటులో వచ్చిన మార్పులు ఈ స్థాయిలో లేవు.

అద్దం దాచిన మోడీ ప్రభుత్వం!

ముఖం బాగాలేదని అద్దాన్ని దాచి పెట్టినట్టు... కేంద్ర ప్రభుత్వం ఎన్ఎస్ఎస్ఒ సర్వే రిపోర్టును బయటకు రాకుండా తొక్కి పెట్టింది. ప్రభుత్వ చర్య వివాదాస్పదమై నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ (ఎన్.ఎస్.సి) ఛైర్మన్, మరో సభ్యుడు సోమవారంనాడు తమ పదవులకు రాజీనామా చేశారు. సర్వే నివేదికను ఎన్.ఎస్.సి. ఆమోదించిన తర్వాత ప్రభుత్వం తొక్కిపెట్టడాన్ని వారిద్దరూ నిరసించారు.

కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒక్క రోజు ముందు బిజినెస్ స్టాండర్డ్ పత్రిక ఎన్ఎస్ఎస్ఒ నివేదికపై వార్తా కథనాన్ని ప్రచురించింది. దీంతో కలకలం మొదలైంది. గణాంకాలను తొక్కిపెట్టినందుకు మోడీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోడీ హయాంలో ఒక్క 2017-18 లోనే 6.5 కోట్ల మంది ఉపాధి కోల్పోయారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

ఈ స్థాయిలో ఎందుకు?

ప్రధానంగా చదువుకున్నవాళ్లకు ఉద్యోగాలు లేవు. పట్టణ ప్రాంతాల్లోగానీ, గ్రామీణ ప్రాంతాల్లోగానీ యువతలో నిరుద్యోగం ఈ కారణంగా బాగా పెరిగింది. వ్యవసాయం లాభసాటిగా లేక ఇతర రంగాలవైపు మళ్ళేవాళ్లకీ ఉపాధి లభించడంలేదు. ఉపాధి రహిత వృద్ధి రేటుకు డీమానెటైజేషన్ ప్రభావం తోడైంది. దీంతో... గత రెండేళ్లలో చాలా మంది ఉపాధి కోల్పోయారు.

ఫలితంగా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు (ఎల్.ఎఫ్.పి.ఆర్) కూడా అసాధారణంగా 36.9 శాతానికి ( 2017-18) పడిపోయింది. 2011-12తో పోలిస్తే ఈ పతనం వేగంగా ఉంది. చదువుకున్న గ్రామీణ యువకులలో నిరుద్యోగ స్థాయి 2017-18లో 10.5గా ఉంది. ఈ కేటగిరిలో నిరుద్యోగం 2004-05లో 3.5 శాతం కాగా 2011-12లో 4.4 శాతం.

విద్యతో నిమిత్తం లేకుండా గ్రామీణ ప్రాంతాల్లోని మొత్తం యువతను తీసుకుంటే... నిరుద్యోగం రేటు 2011-12లో యువకుల్లో 5 శాతం, యువతులలో 4.8 శాతం ఉంది. పట్టణ యువకులలో ఆరేళ్ల క్రితం నిరుద్యోగ స్థాయి 8.1 శాతంగా ఉంటే గత ఏడాది 18.7 శాతానికి పెరిగింది. పట్టణ యువతులలో అది 13.1 నుంచి ఏకంగా 27.2 శాతానికి పెరిగింది.

ఏటా రెండు కోట్ల ఉద్యోగాల సంగతి అలా ఉంచితే... ఎక్కడ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రకటన వస్తే అక్కడ విపరీతమైన పోటీ నెలకొంది. రైల్వేలలో కొన్ని వేల పోస్టులకు కోట్ల సంఖ్యలో దరఖాస్తులు రావడం పరిస్థితి తీవ్రతను వెల్లడించే ఒకానొక అంశం.