టైగర్ ట్రైలర్ అదిరింది! (వీడియో)

భారీ విజయం సాధించిన ఏక్తా టైగర్ సినిమా సీక్వెల్ ‘టైగర్ జిందాహై’ ట్రైలర్ మంగళవారం విడుదలైంది. అంచనాలకు తగ్గట్టు భారీ యాక్షన్ సన్నివేశాలతో రూపొందించిన ట్రైలర్ ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. సల్మాన్ ఖాన్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. గత జూన్ మాసంలో విడుదలైన ’ట్యూబ్ లైట్’తో డిజాస్టర్ చూసిన అభిమానులకు ‘టైగర్ జిందాహై’ ట్రైలర్ ఉత్సాహాన్ని కలిగించింది. విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్ లో వీడియో చూపుల సంఖ్య 40 లక్షలకు చేరువైంది. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన ఈ సినిమా క్రిస్టమస్ పండుగను పురస్కరించుకొని డిసెంబర్ 22వ తేదీన విడుదల కానుంది.

భారత గూఢచారిగా సల్మాన్ ఖాన్, పాకిస్తాన్ స్పై పాత్రలో కత్రినా కైఫ్ గంభీరంగా కనిపించారు. ఇరాక్ లో 2014లో జరిగిన ఒక యధార్థ ఘటన ఆధారంగా కథను రూపొందించినా… వాస్తవానికి ఫిక్షన్ ఎక్కువని దర్శకుడు అలి అబ్బాస్ జాఫర్ చెప్పారు. ఇరాక్ అంతర్యుద్ధం నేపథ్యంలో.. భారత దేశానికి చెందిన నర్సులను బంధించిన ఘటన ఈ కథకు ప్రేరణగా నిలిచింది. ఆ సంఘటన చుట్టూ అల్లిన సన్నివేశాలు, పాత్రల సమాహారమే ఈ యాక్షన్ థ్రిల్లర్. యష్ రాజ్ ఫిల్మ్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇంకా పరేష్ రావెల్, గిరీష్ కర్నాడ్, సుదీప్ తదితరులు నటిస్తున్నారు.

Leave a Comment