యూపీ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ వ్యాఖ్య..
తండ్రిని బంధించిన చక్రవర్తిపై చరిత్ర వక్రీకరణ..
ఘాటుగా స్పందించిన ఎంఐఎం అధ్యక్షుడు ఒవైసీ
ఉత్తరప్రదేశ్ లోని బిజెపి ప్రభుత్వం టూరిజంపై ప్రచురించిన టూరిజం బుక్ లెట్ లో తాజ్ మహల్ ప్రస్తావన లేకపోవడం విమర్శలకు తావిచ్చిన నేపథ్యంలో… ఆ పార్టీ ఎమ్మెల్యే ఒకరు మరో అడుగు ముందుకు వేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. యుపిలోని సర్ధానా ఎమ్మెల్యే సంగీత్ సోమ్ తాజ్ మహల్ చరిత్రను ప్రశ్నిస్తూ, మొఘల్ చక్రవర్తులను దేశద్రోహులుగా అభివర్ణించారు. తాజ్ మహల్ పేరు పర్యాటక ప్రదేశాల జాబితానుంచి తొలగించడంపై చాలా మంది బాధ పడ్డారని ఎద్దేవా చేసిన సోమ్, తాజ్ మహల్ ది ఏమి చరిత్ర అని ప్రశ్నించారు.
ఈ చరిత్ర… తండ్రిని చెరసాలలో బంధించి తాజ్ మహల్ నిర్మించిన వ్యక్తిదేనా’’
బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్
భారతదేశాన్ని ఆక్రమించినవారిని చరిత్రలో గొప్పగా చిత్రించారన్న సోమ్… బాబర్, అక్బర్, ఔరంగజేబు వంటి మొఘల్ చక్రవర్తులు దేశద్రోహులని వ్యాఖ్యానించారు. వారి పేర్లను పాఠ్యపుస్తకాలనుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ బిజెపి ఎమ్మెల్యే వ్యాఖ్యలపై… ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్ధీన్ ఒవైసీ మండిపడ్డారు.
ఈ వ్యాఖ్యల తర్వాత… తాజ్ మహల్ ను ఎవరూ సందర్శించవద్దని ప్రభుత్వం చెబుతుందా? అని ఒవైసీ ప్రశ్నించారు.
’’ఆ దేశద్రోహులే ఎర్రకోటను నిర్మించారు. మరి ప్రధాని మోదీ ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం ఆపేస్తారా? మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాద్ తాజ్ మహల్ ను సందర్శించవద్దని దేశీ, విదేశీ టూరిస్టులకు చెబుతారా?’’ అని ఒవైసీ వ్యాఖ్యానించారు.