టి20లలో 3కి తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంకు
వన్డేలలో నెంబర్ 1, టెస్టులలో 2
టి20 అంతర్జాతీయ క్రికెట్లో భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ర్యాంకు 3కు తగ్గింది. ఇండియా-శ్రీలంక సిరీస్ నుంచి పెళ్లికోసం విరామం తీసుకొని ఇటలీ వెళ్ళిన కోహ్లీ తాజా ర్యాంకింగ్ ప్రకారం 48 పాయింట్లు కోల్పోయాడు. దీంతో మొదటి స్థానాన్ని ఆస్ట్రేలియన్ ఓపెనర్ ఆరోన్ ఫించ్ ఆక్రమించాడు. ఫించ్ రెండో స్థానంనుంచి మొదటికి ఎగబాకితే వెస్ట్ ఇండీస్ ఎడమచేతి వాటం బ్యాట్స్ మన్ ఎవిన్ లూయిస్ మూడో స్థానంనుంచి 2కు చేరుకున్నాడు.
ఇండియా-శ్రీలంక తాజా సిరీస్ తర్వాత టి20 ర్యాంకులను ఐసీసీ సోమవారం సవరించింది. ఈ సిరీస్ ను 3-0 తేడాతో కైవశం చేసుకున్న ఇండియా టీమ్ ర్యాంకులలో మెరుగుపడగా.. సిరీస్ కు దూరమైన కోహ్లీ వ్యక్తిగతంగా నష్టపోయాడు. కోహ్లీ పాయింట్లు 824 నుంచి 776కు తగ్గాయి. అయితే, వన్డేలలో మొదటి స్థానంలో, టెస్టులలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అంటే… మూడు ఫార్మాట్లలో విడివిడిగా 1,2,3 ర్యాంకులలో విరాట్ కోహ్లీ ఉన్నాడు.
మిగిలిన ఇండియన్లలో లోకేష్ రాహుల్ తన ర్యాంకును గణనీయంగా మెరుగుపరుచుకున్నాడు. అతను ఏకంగా 23 స్థానాలు మెరుగుపడి కోహ్లీ తర్వాత నాలుగో స్థానంలో నిలిచాడు. శ్రీలంకతో సిరీస్ లో 154 పరుగులు చేయడం ఇందుకు దోహదపడింది. కాగా, రోహిత్ శర్మ నాలుగు స్థానాలు మెరుగుపడి 14వ ర్యాంకుకు చేరాడు. విరాట్ కోహ్లీ బాలీవుడ్ నటి అనుష్క శర్మను ఈ నెల 11వ తేదీన వివాహం చేసుకున్నాడు.
బుమ్రా కూడా అంతే..
టి20 బ్యాట్స్ మెన్ ర్యాంకులలో కోహ్లీ తరహాలోనే… బౌలింగ్ ర్యాంకులలో టాప్ ర్యాంకర్ జస్ప్రీత్ బుమ్రా కూడా శ్రీలంక సిరీస్ ఫైనల్ మ్యాచ్ కు దూరమై తన ర్యాంకును మిస్ చేసుకున్నాడు. అతను తాజా ర్యాంకులలో మూడో స్థానానికి పరిమితం కాగా…పాకిస్తాన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఇమాద్ వాసిమ్ టాప్ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. ఆప్ఘనిస్తాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ కెరీర్ బెస్టు ర్యాంకు (2)ను పొందాడు.
ఈసారి బ్యాటింగ్, బౌలింగ్ ర్యాంకులలో తొలి స్థానాల్లో నిలిచిన ఫించ్, ఇమాద్ గతంలోనూ టాప్ ర్యాంకులను పొందినవారే. ఫించ్ ఏకంగా 121 మ్యాచులు, 368 రోజులపాటు నెంబర్ 1గా నిలిచాడు. ఇమాద్ 15 మ్యాచులు 132 రోజులపాటు టాప్ లో ఉన్నాడు. 2016 మార్చి 18న ఫించ్ తన టాప్ ర్యాంకును కోల్పోయాడు. ఇమాద్ ఈ ఏడాది నవంబర్ 4న ఫస్ట్ ర్యాంకును పోగొట్టుకొని నెలన్నరలో తిరిగి పొందాడు.