‘అమ్మ’ కోట ఆర్కే నగర్లో ఏం జరిగింది… ఫుల్ స్టోరీ

admin
0 0
Read Time:9 Minute, 36 Second
విశాల్, దీప నామినేషన్ల తిరస్కరణ, హైడ్రామా

జయలలిత చనిపోయారు… లేదు లేదు బ్రతికే ఉన్నారు… మళ్ళీ మరణించారు…!
విశాల్ నామినేషన్ చెల్లదు… లేదు చెల్లుతుంది… కాదు తిరస్కరించాం…!!

చెన్నైలో ఏడాది క్రితం మాజీ సిఎం జయలలిత మరణం విషయంలో ఎంత గందరగోళం నెలకొందో…ఈ మంగళవారం సినీ నటుడు విశాల్ నామినేషన్ విషయంలోనూ అంతే అయోమయం ముసురుకుంది. అదీ జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ అసెంబ్లీ స్థానానికి జరగాల్సిన ఉప ఎన్నికల విషయంలోనే కావడం యాధ్చచ్ఛికం. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో అనుకోని అతిధిలా వచ్చిన సినీ నటుడు విశాల్ కృష్ణ నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఆయనకంటే ముందుగా జయలలిత మేనకోడలు దీప నామినేషన్ ను కూడా ఎన్నికల అధికారులు తిరస్కరించారు.

నామినేషన్ పత్రాల్లో తప్పనిసరిగా భర్తీ చేయవలసిన కాలమ్స్ చాలా ఖాళీగా వదిలేశారన్న కారణంగా దీపను తప్పించారు. విశాల్ ను అభ్యర్ధిగా ప్రతిపాదించిన 10 మందిలో ఇద్దరు అడ్డం తిరిగి… తమ సంతకాలను ఫోర్జరీ చేసినట్టుగా చెన్నై జిల్లా ఎన్నికల అధికారి ఎదుట వాంగ్మూలమిచ్చారు. చట్టబద్ధంగా అవసరమైన 10మంది ప్రతిపాదకుల పేర్లు లేకపోవడంతో విశాల్ నామినేషన్ ను తిరస్కరించారు. ఇక్కడే హైడ్రామా మొదలైంది. దీప తన నామినేషన్ తిరస్కరణ రాజకీయ కుట్రగా ఆరోపించి ఊరుకుంటే.. విశాల్ వీధి పోరాటానికి దిగాడు.

తన నామినేషన్ తిరస్కరణకు నిరసనగా రిటర్నింగ్ అధికారి కార్యాలయంవద్ద రోడ్డుపై బైఠాయించిన విశాల్, అతని మద్ధతుదారులకు కొద్దిసేపటి తర్వాత పోలీసులు సర్దిచెప్పి పంపించారు. అయితే, విశాల్ కొద్దిసేపటి తర్వాత ఒక ఫోన్ సంభాషణకు సంబంధించిన క్లిప్ ను ఎన్నికల అధికారులకు సమర్పించి.. తన మద్ధతుదారులను బెదిరించి అలా చెప్పించారని, కాబట్టి తన నామినేషన్ ను ఆమోదించాలని కోరారు. బయటకు వచ్చి మీడియా ముందు తన నామినేషన్ ను ఆమోదించినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి చెప్పారని వెల్లడించాడు. ఎన్నికల కమిషన్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన విశాల్, ఈ విషయాన్ని ట్విట్టర్ లో కూడా పోస్టు చేశారు.

‘‘చాలా పోరాటం తర్వాత ఆర్కే నగర్ ఎన్నికకోసం నా నామినేషన్ ఆమోదం పొందింది. నిజం ఎప్పుడూ గెలుస్తుంది. న్యాయం జరిగింది. ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది’’ అని విశాల్ ట్వీట్ చేశారు. దీంతో విశాల్ మద్ధతుదారులు సంతోషం వెలిబుచ్చారు. ఎన్నికల అధికారులు ఆ సమయంలో సంప్రదించినవారికి ‘విశాల్ నామినేషన్ పరిశీలనలో ఉంది. దీప నామినేషన్ ను తిరస్కరించాం’ అని బదులిచ్చారు. అయితే, రాత్రి బాగా పొద్దుపోయాక మరోసారి విశాల్ నామినేషన్ ను తిరస్కరించినట్టే ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీంతో.. విశాల్ అర్ధరాత్రి సమయంలో ఓ ప్రకటన చేశారు. ఒక స్వతంత్ర అభ్యర్ధిని, యువకుడిని ఎంపిక చేసి అతని విజయంకోసం పాటుపడతానని విశాల్ చెప్పాడు.

మొదటి వ్యక్తే అడ్డం తిరిగారు!

విశాల్ నామినేషన్ పత్రాల్లో ప్రతిపాదకులుగా సంతకాలు చేసిన 10 మందిలో మొదటి వ్యక్తే చివరికి అడ్డం తిరిగారు. సుమతి అనే ఆ మహిళతోపాటు సీరియల్ నెంబర్ 9లో ఉన్న దీపన్ అనే వ్యక్తి కూడా అనంతరం రిటర్నింగ్ అధికారి వేలుస్వామిని కలసి విశాల్ అభ్యర్ధిత్వాన్ని తాము ప్రతిపాదించలేదని, తమ సంతకాలను ఫోర్జరీ చేశారని రాతపూర్వకంగా రాసి ఇచ్చారు. ఈ అభ్యర్ధన ఆధారంగా విశాల్ నామినేషన్ ను వేలుస్వామి తిరస్కరించారు. తర్వాత విశాల్ సుమతికి సంబంధించిన ఓ వ్యక్తి తనతో మాట్లాడినప్పుడు రికార్డు చేసిన ఆడియో క్లిప్పును తెచ్చి వేలుస్వామికి అందించారు.

ఆడియో టేపులో ఏముంది?

విశాల్ ప్రతిపాదకుల్లో మొదటి వ్యక్తి అయిన సుమతి కుటుంబీకులను అన్నాడిఎంకె అభ్యర్ధి ఇ. మధుసూదనన్ మనుషులు బెదిరించారని ఆమెకు సంబంధించిన వ్యక్తే ఒకరు చెప్పిన విషయం రికార్డయింది. సుమతి సంతకం ఫోర్జరీ చేసినట్టుగా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయాలని బెదిరించినవారు ఆదేశించినట్టు ఆమెకు సంబంధించిన ఆ వ్యక్తి విశాల్ కు ఫోన్ లో చెప్పారు. ఆ క్లిప్ ను ఆధారంగా చూపి విశాల్ తన ప్రతిపాదకులను బెదిరించారని, అందువల్ల తన నామినేషన్ ను ఆమోదించాలని విన్నవించారు.

అయితే, విశాల్ ఫిర్యాదుపైన విచారణ జరిపిన ఎన్నికల అధికారి… తాము ప్రతిపాదించలేదన్న ఇద్దరి ప్రత్యక్ష వాంగ్మూలాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. విశాల్ సమర్పించిన ఆడియో క్లిప్ లో ఉన్న అవతలి వ్యక్తి మాటల్లోని నిజానిజాలను నిర్ధారించడం సాధ్యం కాదు కాబట్టి ఆ నామినేషన్ ను తిరస్కరిస్తున్నట్టు చెప్పారు.

రిటర్నింగ్ అధికారి నిర్ణయమే ఫైనల్!

నామినేషన్ పత్రాలను ఒకసారి రిటర్నింగ్ అధికారి తిరస్కరిస్తే బాధిత అభ్యర్ధికి మద్రాసు హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేసే ఏకైక అవకాశం ఉంటుందని ఎన్నికల కమిషన్ అధికారి ఒకరు చెప్పారు. దానిపై జిల్లా ఎన్నికల అధికారికిగానీ, ఎన్నికల కమిషన్ కు గానీ విన్నవించే అవకాశం లేదని ఆ అధికారి స్పష్టం చేశారు. అదే సమయంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఏ కోర్టూ స్టే ఇవ్వజాలదని కూడా ఆ ఈసీ అధికారి స్పష్టం చేశారు.

మొత్తం 145 నామినేషన్లు.. ఆమోదం పొందినవి 72

ఆర్కే నగర్ ఉప ఎన్నికకోసం 145 నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల అధికారి ప్రకటించారు. అందులో 72 నామినేషన్లను వివిధ కారణాలవల్ల ఆమోదించినట్టు పేర్కొన్నారు. జయలలిత మేనకోడలు దీప ‘ఆస్తులు, అప్పుల వివరాలు’ సెక్షన్ ను ఖాళీగా ఉంచినట్టు వారు తెలిపారు. జయలలిత ఆస్తులు తనకు చెందుతాయని వాదిస్తున్న దీప వాటికి సంబంధించిన గందరగోళంలో ఆ సెక్షన్ ను వదిలేసి ఉండొచ్చు.

ఈ నెల 21వ తేదీన జరగాల్సిన ఉప ఎన్నికకోసం అధికార అన్నాడిఎంకె, ప్రతిపక్ష డిఎంకె అభ్యర్ధులతోపాటు అన్నాడిఎంకె అమ్మ అభ్యర్ధి దినకరన్, ఇతర పార్టీల అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. ఈ సీటు గెలుచుకోవడం అధికార పార్టీకి చాలా అవసరం. మరోవైపు అధికార పార్టీ బలహీనపడిన నేపథ్యంలో… డిఎంకె చాలా ఆశలు పెట్టుకుంది. తెలుగువారు ఎక్కువగా ఉండటం అధికార పార్టీ అభ్యర్ధికి లాభిస్తుందని భావిస్తున్న సమయంలో విశాల్ వంటివారి పోటీని నివారించడానికి ప్రయత్నాలు జరగడం సహజం!

జయలలిత మరణం తర్వాత తమిళనాడు రాజకీయం ఎలా ఉందో.. భారత ఎన్నికల కమిషన్ ఆర్కే నగర్ ఉప ఎన్నికను నిర్వహిస్తున్న తీరూ అంతే ఉంది. జయలలిత మరణించి మంగళవారానికి సరిగ్గా సంవత్సరమైంది. ఆమె ప్రాతినిధ్యం వహించిన ఆర్.కె. నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంతవరకు ఉప ఎన్నిక నిర్వహించకపోవడమే ఓ వైఫల్యం. ఎవరైనా ఎమ్మెల్యే మరణిస్తే ఆర్నెల్లలోపు ఉప ఎన్నిక జరగాలి… ఏడాది తర్వాత నిర్వహిస్తున్నా ఎన్ని వివాదాలో…!

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Next Post

మార్చిలో డిఎస్సీ 2018 పరీక్షలు... 12,370 పోస్టులకు 15న నోటిఫికేషన్

జూన్ 8-11 తేదీల్లో పోస్టింగ్ ఉత్తర్వులు Share Tweet LinkedIn Pinterest
error

Enjoy this blog? Please spread the word