-
’’క్రిప్టోరూబుల్’’కు పుతిన్ ఆమోదం
-
బ్లాక్ చైన్ టెక్నాలజీతో.. ప్రభుత్వ నియంత్రణలో నిర్వహణ
కొద్ది నెలలపాటు సాగిన ఊహాగానాలకు తెర దించుతూ రష్యా కొత్త క్రిప్టో కరెన్సీని ప్రకటించింది. కొత్త కరెన్సీ ’’క్రిప్టోరూబుల్’’కు దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆమోద ముద్ర వేశారు. ఇకపైన రష్యన్ సమాఖ్య ’’క్రిప్టోరూబుల్’’ను జారీ చేయనుంది. దీంతో వర్చుయల్ మనీని ప్రవేశపెట్టిన తొలి దేశంగా రష్యా రికార్డులకు ఎక్కనుంది.
’’క్రిప్టోరూబుల్’’ రష్యన్ క్రిప్టోగ్రఫీ ఆధారంగా రూపుదిద్దుకుంటుంది. త్వరలోనే దాని డెవలప్మెంట్ సాధ్యమని రష్యన్ అధికారులు చెబుతున్నారు. ఈ వర్చువల్ మనీ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారంగా నడుస్తుంది. అయితే, రష్యా ప్రభుత్వమే దీన్ని నియంత్రిస్తుంది.
సోమవారం మాస్కోలో జరిగిన ఒక ఆంతరంగిక సమావేశం తర్వాత… ‘‘క్రిప్టోరూబుల్’’ నిర్ణయాన్ని రష్యన్ కమ్యూనికేషన్స్ మంత్రి నికొలాయ్ నికిఫొరోవ్ ప్రకటించారు. క్రిప్టో కరెన్సీని సాధారణ రూబుల్స్ తో కూడా మార్చుకోవచ్చు. 13 శాతం పన్ను వర్తిస్తుంది. క్రిప్టోరూబుల్ ను తాము ఇప్పుడు ప్రకటించకపోతే… రెండు నెలల్లో యూరేసియన్ ఎకనామిక్ కమ్యూనిటీలోని దేశాలు ప్రకటించే అవకాశం ఉందని నికిఫొరోవ్ పేర్కొన్నారు.
రష్యన్ వ్యాపార కూటమి ’’అవంతి’’ నుంచి విన్నపం వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ ప్రకటన వెలువడింది. విదేశీ క్రిప్టో కరెన్సీతో రిస్క్ ఉందని, అందువల్ల దేశీయంగా చలామణిలో ఉన్న క్రిప్టో కరెన్సీలను చట్టబద్ధం చేయాలని ’’అవంతి’’ రష్యా ప్రభుత్వాన్ని కోరింది.
ఏ క్రిప్టో కరెన్సీతోనైనా ఉండే సమస్యలపైనా రష్యాలో చర్చ జరిగింది. కరెన్సీ జారీపై నియంత్రణ లేకపోవడం, మనీ లాండరింగ్, ఆన్ లైన్ ఫ్రాడ్, అనూహ్యమైన ఎక్సేంజ్ రేటు తదితర సమస్యలు ఉంటాయని ’’అవంతి’’ ఛైర్మన్ రఖ్మన్ యాన్సుకోవ్ చెప్పారు. డార్క్ నెట్ లో డ్రగ్స్, ఆయుధాల కొనుగోలుకు కూడా క్రిప్టో కరెన్సీని వినియోగిస్తుంటారని పేర్కొన్నారు. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకొని ఒక జాతీయ క్రిప్టోకరెన్సీని రూపొందించాలని ’’అవంతి’’ సూచించింది.
రష్యాలో ఇదివరకే క్రిప్టో కరెన్సీ జారీకి కొన్ని ప్రయత్నాలు జరిగాయి. బిట్ కాయిన్ తరహాలో ’’రుకాయిన్’’ను రష్యా నేషనల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఇన్నొవేటివ్ టెక్నాలజీస్ రూపొందించింది. అది కొన్ని అంతర్జాతీయ వేదికలలో లిస్టయింది కూడా.. రుకాయిన్ రూపకర్తలు రెండు లక్షల డాలర్లమేరకు పెట్టుబడిని కూడా ఆకర్షించారు.