చంద్రబాబు కాపుల అంబేద్కర్ : తోట త్రిమూర్తులు
ఇతర అగ్రవర్ణ పేదలకూ ఇవ్వండి : విష్ణుకుమార్ రాజు
కాపులను బీసీలలో చేరుస్తూ 5 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లుకు రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేని శాసనసభలో అధికార తెలుగుదేశం పార్టీ సభ్యులు, మిత్రపక్షమైన బిజెపి సభ్యులు మూకుమ్మడిగా మద్ధతు ప్రకటించారు. ఆ మద్ధతుకు ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి… కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించేవరకు కలసి కట్టుగానే వ్యవహరిద్దామని పిలుపునిచ్చారు. ముఖ్యంగా బిజెపికి చెందిన మంత్రులు, శాసనసభ్యులను ఉద్దేశించి సిఎం ఈ మాట చెప్పారు. ఈ బిల్లును కేంద్రం 9వ షెడ్యూలులో చేర్చాల్సి ఉందని, అప్పుడే చట్టం అవుతుందని చెప్పిన ముఖ్యమంత్రి… ఆ బాధ్యత అందరం తీసుకుందామని ప్రతిపాదించారు. మరోవైపు శాసన మండలిలోనూ ఈ బిల్లు ఆమోదం పొందింది.
ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ వర్గాలకు ఉన్న రిజర్వేషన్లు 50 శాతానికి అదనంగా మరో 5 శాతం కాపులకు ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆ విధానానికి రాజ్యాంగబద్ధత తప్పనిసరి అయింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ రిజర్వేషన్ బిల్లును రూపొందించి శాసనసభ శీతాకాల సమవేశాల చివరి రోజైన శనివారం ఉభయసభల్లోనూ ఆమోదింపజేసింది ప్రభుత్వం. తర్వాత ఈ బిల్లును ఢిల్లీ పంపించి ఫాలో అప్ చేస్తామని సిఎం ఉభయ సభల్లోనూ ప్రకటించారు.
రాజ్యాంగబద్ధత లేకుండా రిజర్వేషన్ కల్పిస్తే కోర్టులు కొట్టివేసే అవకాశం ఉందని, ఇటీవల ఓ కేసులో అలాగే జరిగిందని సిఎం చెప్పారు. అందుకే తాను ఒక పద్ధతి ప్రకారం… బీసీ కమిషన్ చేత అధ్యయనం చేయించానని, కమిషన్ సిఫారసులమేరకు నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. అయితే, బయట కొంతమంది ఇప్పటికీ విమర్శలు చేస్తున్నారని, సమాజం సుస్థిరంగా ఉంటే వారు ఓర్వలేరని, అతలాకుతలం చేసే ఆందోళనలు వారికి కావాలని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
రాజకీయాలకు అతీతంగా అన్ని కులాలకు చెందిన శాసనసభ్యులూ ఏకకంఠంతో రిజర్వేషన్లను సభలో ఆమోదించారన్న సిఎం.. అందుకు వారిని అభినందించారు. కేంద్రం ఆమోదించేవరకు అంతా ఇలాగే సహకరించాలని కోరారు. కాపు రిజర్వేషన్లపై బీసీ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ మంజునాథ మినహా మిగిలిన సభ్యులు ఇచ్చిన ఈ నివేదికను.. బీసీ వర్గానికి చెందిన మంత్రి అచ్ఛెన్నాయుడు శాసనసభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బిల్లుపై బిజెపి శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు సహా అధికారపక్షంలోని అనేకమంది ఎమ్మెల్యేలు మాట్లాడారు. అందరూ ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచెత్తారు.
అగ్రవర్ణ పేదలు, రజకుల సంగతి చూడండి : రాజు
ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాన్ని ఆచరణలోకి తెస్తున్నందుకు ముఖ్యమంత్రిని పశంసించిన మిత్రపక్షం బిజెపి నేత విష్ణుకుమార్ రాజు… ఇతర అగ్రవర్ణాల్లోనూ పేదలున్నారని, వారు విద్యా ఉపాధి అంశాల్లో వెనుకబడ్డారని చెప్పారు. మరోవైపు రజకులను ఎస్సీలలో చేరుస్తామని కూడా టీడీపీ మేనిఫెస్టోలో పెట్టారని, ఈ విషయాలను కూడా సానుకూలంగా పరిష్కరించాలని ముఖ్యమంత్రిని కోరారు.
కాపులకు అంబేద్కర్ చంద్రబాబు : తోట
కాపుల చిరకాల కోర్కెను నెరవేర్చిన చంద్రబాబును తమ జాతి ఎన్నటికీ గుర్తు పెట్టుకుంటుందని టీడీపీలో ఆ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు పలువురు వ్యాఖ్యానించారు. తోట త్రిమూర్తులు ముఖ్యమంత్రి చంద్రబాబును ‘కాపుల అంబేద్కర్’గా అభివర్ణించారు. ఇలా శాసనసభ లోపల, ఆవరణలో మాట్లాడిన కాపు ఎమ్మెల్యేలంతా చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు.
ఇదీ తదుపరి ప్రక్రియ
అసెంబ్లీ, మండలి ఆమోదించిన రిజర్వేషన్ల బిల్లును ముందుగా గవర్నర్ నరసింహన్ కు పంపుతారు. ఆయన ఆమోదంతో అది కేంద్రానికి చేరుతుంది. కేంద్ర ప్రభుత్వానికి ఈ తాజా రిజర్వేషన్ల విధానం ఓకే అయితే… అప్పుడు మాత్రమే అది పార్లమెంటు తలుపు తడుతుంది. పార్లమెంటు ఆమోదంతో రాజ్యాంగంలోని 9వ షెడ్యూలులో చేరితో ఆంధ్రప్రదేశ్ నూతన రిజర్వేషన్ విధానానికి రాజ్యాంగపరంగా తాత్కాలికంగా రక్షణ లభించినట్టే. దీన్ని సుప్రీంకోర్టు జ్యుడిషియల్ రివ్యూకు తీసుకోకుంటే ఈ రిజర్వేషన్ శాశ్వతమవుతుంది.