సిద్ధాంత పరంగా ఎవరితోనైనా విభేదిస్తాం : చంద్రబాబు

8 0

ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా విజయం మనదే

ఇక రాజకీయ కసరత్తుకే తొలి ప్రాధాన్యం

తెలుగుదేశం పార్టీ కార్యగోష్ఠిలో కీలక వ్యాఖ్యలు

‘‘వ్యక్తిగతంగా ఎన్డీఏతోగాని, యూపిఏతోగాని విభేదాలు లేవు. ముస్లిం మైనారిటీల అంశం వచ్చినప్పుడు కేంద్రంతో విభేదించాం. ట్రిపుల్ తలాక్ అంశంలో విభేదించాం. హజ్ యాత్రకు నిధులు నిలిపివేయడంపై విభేదించాం. ఎన్డీఏతో విబేధించినందుకు తెలుగుదేశం పార్టీకి ధన్యవాదాలు తెలుపుతున్నట్లుగా అసదుద్దీన్ ఒవైసి ప్రకటించారు. సమాజ హితం కోసం సిద్ధాంతపరంగా ఎవరితోనైనా విబేధిస్తాం’’... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలివి. కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న తమ మిత్రపక్షం బిజెపి విషయంలో ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలకు నిర్వహించిన కార్యగోష్ఠిలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అదే సమయంలో ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రయోజనాల విషయంలోనూ రాజీ పడే ప్రసక్తి లేదని పునరుద్ఘాటించారు. ‘‘ఎక్కడా రాజీపడటంలేదు. రాష్ట్రం కష్టాలలో ఉంది కాబట్టే జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాం. తప్పటడుగు వేస్తే ప్రజలు నష్టపోతారు. మనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం’’ అని స్పష్టం చేశారు. విభజన చట్టంలోని అంశాలు, అప్పటి ప్రధాని ఇచ్చిన హామీల అమలు విషయమై ఇటీవల ప్రధాని నరేంద్రమోడికి చెప్పాల్సిందంతా చెప్పానని, ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీకి కూడా వివరించానని చంద్రబాబు తెలిపారు. కేంద్రంనుంచి వివిధ కార్యక్రమాల కింద రూ.16వేల కోట్లు రావాలసి ఉందని, తొలిఏడాది రెవెన్యూ లోటు రూ.16వేల కోట్లు కాగా 4వేల కోట్లు ఇచ్చారని, మొత్తంగా రూ.7500కోట్లు ఇస్తామని ఆర్ధికమంత్రి హామీ ఇచ్చారని, మిగిలింది త్వరగా ఇవ్వాలని తాను అడిగానని సిఎం వివరించారు.

‘‘గిరిజన విశ్వవిద్యాలయం, కేంద్రీయ విశ్వవిద్యాలయం ఇంకా ఏర్పాటు కావలసిఉంది. ఇప్పటికే ఏర్పాటు చేసిన 9 విద్యా సంస్థలకు మరిన్ని నిధులు ఇవ్వాల్సి ఉంది. విశాఖ రైల్వేజోన్, కడప స్టీల్ ఫాక్టరీ, దుగరాజపట్నం పోర్ట్ అంశాలను త్వరితగతిన క్లియర్ చేయాలని కోరాను. కాకినాడ పెట్రో కాంప్లెక్స్ గురించి కూడా కేంద్రానికి తెలియజేశాం. ప్రధాని, ఆర్ధికమంత్రి సానుకూలంగా స్పందించారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు’’ అని చంద్రబాబు చెప్పారు.

మళ్ళీ ప్రభుత్వం మనదే

‘‘ఎన్నికలు ఎప్పుడు పెట్టినా 100%కాదు..1000% ప్రభుత్వం మనదే. ఎక్కడ ఎన్ని ఓట్లు వస్తాయో అన్నీ నాకు కొట్టినపిండే’’ అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. అదే సమయంలో నాయకులకు జాగ్రత్తలూ చెప్పారు. ‘‘ఈరోజు ఎన్నిక పెడితే ఎన్ని నియోజకవర్గాలలో గెలుస్తామో చెబుతా. ఏ నియోజకవర్గంలో ఎంత మెజారిటీ వస్తుందో చెబుతా. నాయకుల పనితీరు, ప్రవర్తన, సాంఘిక రాజకీయ పరిస్థితుల కారణంగానే కొన్ని నియోజకవర్గాలలో బలహీనంగా ఉన్నాం. పనితీరు మెరుగుపరుచుకోవడం మనచేతిలో పని. దూరమైన వర్గాలను దగ్గర చేర్చుకుంటేనే సాంఘిక రాజకీయ స్థితిగతులు మనకు అనుకూలంగా మారుతాయి’’ అని చంద్రబాబు తమ పార్టీ నేతలకు హితవు పలికారు.

ప్రజలకు, ప్రతినిధులకు మధ్య ఏమాత్రం దూరం పెరగకూడదని సిఎం పేర్కొన్నారు. దూరం పెరిగితే ప్రతినిధులకే నష్టం తప్ప ప్రజలకు కాదనేది గుర్తుంచుకోవాలని సూచించారు. కుప్పంలో తనకు వచ్చే ఎన్నిక 6వది అని, తనను ఆ నియోజకవర్గ ప్రజలు 40వేల నుంచి 70వేల మెజారిటీతో ఆదరిస్తున్నారు. రేపు గెలిస్తే అక్కడనుంచి 30ఏళ్ళపాటు ప్రాతినిధ్యం వహించినట్టవుతుందని చంద్రబాబు చెప్పారు. ప్రజల్లో నమ్మకం, నాయకత్వ సామర్ధ్యం వల్లే ఇది సాధ్యమైందని అభిప్రాయపడ్డ చంద్రబాబు... ఇదే స్ఫూర్తిని అన్ని నియోజకవర్గాలలో పెంచాలని పార్టీ ప్రజా ప్రతినిధులకు సూచించారు.

ఏడు సెగ్మెంట్లలో గెలిపించే బాధ్యత పార్లమెంటు ఇన్ఛార్జిలది

ప్రతి లోక్ సభ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ గెలిపించాల్సిన బాధ్యత పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జులదేనని చంద్రబాబు స్పష్టం చేశారు. నలుగురు సభ్యుల కమిటీల నివేదికలు రాగానే బలహీన నియోజకవర్గాలపై తాను దృష్టిపెడతానన్న సిఎం... ఇకపై రాజకీయ కసరత్తుకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేశారు. ఫిబ్రవరి నుంచి అందరినీ పిలిచి వ్యక్తిగతంగా మాట్లాడుతానని తెలిపారు. ‘‘మనలో ఐకమత్యం కావాలి,విబేధాలు తొలగించుకోవాలి. పాత, కొత్త కలయిక పక్కాగా.. పకడ్బందీగా జరగాలి. కొన్ని నియోజకవర్గాలు చాలా బాగున్నాయి. చాలా సంతోషం. పేర్లు చెబితే మిగిలిన వాళ్లు నిరుత్సాహపడతారు’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

2019లో ఎమ్మెల్సీలు కనిపించకూడదు

‘‘రాబోయే ఎన్నికల్లో ఎక్కడన్నా ఎమ్మెల్సీలు కలబడితే సహించను. వారికి భవిష్యత్తులో ఎమ్మెల్సీ కూడా ఇవ్వను. వ్యక్తిగత ప్రయోజనాలే కాదు.. పార్టీ ప్రయోజనాలు కూడా ముఖ్యమనేది అందరూ గుర్తుంచుకోవాలి. మీవల్ల పార్టీకి పదిఓట్లు రావాలే గాని, ఓట్లు పోగొట్టేలా మీ ప్రవర్తన ఉండకూడదు. అన్నీ బాగున్నాయి... సార్ కు ఏమీ తెలియదని కొందరు అనుకుంటున్నారు. అది చాలా తప్పు. ఎక్కడ ఏమి జరిగేదీ ఎప్పటికప్పుడు నాకు తెలుస్తున్న విషయం గుర్తుంచుకోవాలి’’ అని చంద్రబాబు పార్టీ నేతలను హెచ్చరించారు.

‘‘ముప్పై నలభై ఏళ్లలో ఎవరూ చేయని పనులు అనేకం చేశాం. వినూత్న సంక్షేమ పథకాలు అమలు చేశాం. మూడున్నరేళ్లు రాత్రింబవళ్లు పనిచేశాం కాబట్టే మీరు గ్రామాలకు వెళ్తే శభాష్ అంటున్నారు. ఈ సంతృప్తిని నిలబెట్టుకోవాలి. దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఇన్ని సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నాయి? ఎన్నిరాష్ట్రాలు రూ.5లక్షల బీమా ఇస్తున్నాయి? ఎన్ని రాష్ట్రాలు గ్రామగ్రామాన సిమెంట్ రోడ్లు నిర్మిస్తున్నాయి? ఎన్నిరాష్ట్రాలు 100% కరెంట్ కనెక్షన్లు, వంటగ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నాయి? ఎన్ని రాష్ట్రాలు 100%ఓడిఎఫ్ కు వెళ్తున్నాయి? అనేదానిపై ప్రజల్లో చర్చ జరుగుతోంది’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

దళితతేజం-తెలుగుదేశ విజయవంతం చేయాలి

అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26 నుంచి దళితతేజం-తెలుగుదేశం కార్యక్రమం ప్రారంభిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఈ కార్యక్రమం అంబేద్కర్ జయంతి (ఏప్రిల్14) వరకు కొనసాగుతుందని, ఇది దళితులకే పరిమితమైనది కాదని, తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక కార్యక్రమమని పేర్కొన్నారు. ‘జన్మభూమి మావూరు’, ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమాలను విజయవంతం చేసిన స్ఫూర్తితోనే ‘దళిత తేజం’ కూడా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ స్మృతివనాన్ని అభివృద్ది చేస్తున్నామని, అదేవిధంగా జగజ్జీవన్ రామ్ మెమోరియల్ కూడా చేపడతామని చెప్పారు. దళితులలో తెలుగుదేశంపార్టీపై ప్రగాఢ విశ్వాసం కల్పించాలని సూచించారు. ఇదే తరహాలో బిసీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ వర్క్ షాపులు నిర్వహిస్తామన్నారు. అన్ని వర్గాలను కలుపుకొనిపోవాలని, బడుగు బలహీనవర్గాలకు అండగా ఉండాలని నేతలకు సూచించారు.

Leave a Reply