వ్యక్తులకైనా, సమూహాలకైనా వేధించడానికి హక్కు ఉండదు
ఇద్దరు మేజర్లు ఇష్టపడి వివాహం చేసుకుంటే అందులో జోక్యం చేసుకొని వేధించడానికి ఆ దంపతుల తల్లిదండ్రులకు సైతం హక్కు లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా ఉద్ఘాటించారు. ‘పరువు హత్య’ల నేపథ్యంలో ఆయన సోమవారం ఈ కీలక వ్యాఖ్య చేశారు. ‘‘ఇద్దరు మేజర్లు వివాహ బంధంతో ఒక్కటైతే అందులో మూడోవారు… అది తల్లిదండ్రులైనా సమాజమైనా ఖప్ పంచాయితీలైనా… జోక్యం చేసుకోవడానికి, దంపతులను వేధించడానికి ఎలాంటి హక్కూ లేదు’’ అని దీపక్ మిశ్రా స్పష్టం చేశారు.
జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం… వివాహితులు ప్రశాంతంగా జీవించే ప్రాథమిక హక్కును గట్టిగా సమర్ధించింది. ఏ వ్యక్తిగానీ, సమూహంగానీ దంపతులను వేధించరాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఒక వివాహం చెల్లుతుందో లేదో… ఆస్తి తగాదాల విషయమైతే పిల్లలు చట్టబద్ధమో కాదో తేల్చవలసింది కోర్టులని, ఏ ఇతర వ్యక్తీ లేదా సమూహం అందులో జోక్యం చేసుకోవడానికి హక్కు లేదని నొక్కి చెప్పింది.
ఇటీవల ప్రేయసి తల్లిదండ్రుల చేతిలో హత్యకు గురైన అంకిత్ సక్సేనా కేసులో సామాజిక కార్యకర్త మధు కిష్వార్ తన వాదనను సుప్రీంకోర్టుకు వినిపించారు. క్రూరమైన ఈ హత్యలకు ‘‘పరువు హత్యలు’’ అని మృదువైన పదజ ాలాన్ని ఉపయోగించరాదని, ‘‘విద్వేష హత్యలు’’గా పిలవాలని ఆమె అభిప్రాయపడ్డారు.
అయితే, ఖప్ పంచాయితీల తరపున హాజరైన న్యాయవాది.. ఆ పంచాయతీలను ‘‘పరువు హత్యల ప్రేరేపకులు’’గా చిత్రిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఖప్ పంచాయితీలు సంప్రదాయంగా వస్తున్నాయని, ఇప్పుడైతే అవి కులాంతర వివాహాలను కూడా ప్రోత్సహిస్తున్నాయని ఆ న్యాయవాది చెప్పుకొచ్చారు. హర్యానాలో లింగ నిష్ఫత్తి దారుణంగా ఉండటంవల్ల ఇతర రాష్ట్రాలనుంచి మహిళలను తెచ్చుకునే పరిస్థితి ఉందన్నారు.
ఒకే గోత్రనామం ఉన్న ఇద్దరు వ్యక్తుల వివాహాలపై ఖప్ పంచాయితీలకు ఉన్న అభ్యంతరాన్ని హిందూ వివాహ చట్టం 1995లోని సెక్షన్ 5 బలపరిచిందని, ఒకే గోత్రంలో ఉన్నవారు వివాహమాడితే జన్యుసంబంధమైన సమస్యలు వస్తాయని ఆ న్యాయవాది వాదించారు. అయితే… పరువు హత్యల్లో కేవలం 3 శాతం మాత్రమే గోత్రనామాలకు సంబంధించినవి కాగా మిగిలిన 97 శాతం మతం, ఇతర కారణాలతో జరిగినవేనని ఆయన చెప్పారు.
దీనికి స్పందించిన చీఫ్ జస్టిస్ మిశ్రా… తాము ఖప్ పంచాయితీల గురించి ఆలోచించడంలేదన్నారు. ‘‘మేమిక్కడ సంప్రదాయాలు, వంశాలపై వ్యాసరచన చేయడంలేదు. పెళ్ళి చేసుకొని కలసి జీవించాలనుకునేవారి స్వేచ్ఛ, వారికి ఎదురవుతున్నవేధింపులపైనే మా ఆలోచన’’ అని దీపక్ మిశ్రా స్పష్టం చేశారు. ఈ సందర్భంలో ఖప్ పంచాయతీల తరపు న్యాయవాది ‘‘ఆచారం మానవ జీవితాలకంటే ఉన్నతమైనది’’ అని వాదించారు.
‘‘పరువు హత్య’’పై శక్తివాహిని అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం ధర్మాసనం వాదనలు వింది. ఈ తరహా హత్యల నిరోధానికి మార్గదర్శకాలను సూచించాలని ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి సూచించగా.. అందుకు కొంత సమయం కావాలని అదనపు సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ కోరారు.