మీ రాజీనామా… లేదా నా రాజకీయ సన్యాసం

విదేశాల్లో ఒక్క రూపాయి ఉన్నట్టు నిరూపించినా సరే…
ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిపక్ష నేత జగన్ సవాల్..
‘ప్యారడైజ్ పేపర్స్’ వివాదంపై స్పందన

‘ప్యారడైజ్ పేపర్స్’లో తన పేరు కూడా ప్రస్తావనకు వచ్చిన నేపథ్యంలో అధికార తెలుగుదేశం పార్టీ చేసిన ఆరోపణలకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆ ఆరోపణలు నిజమని నిరూపించలేకపోతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆరోపణలు నిరూపించేట్లయితే తాను రాజకీయాలనుంచే తప్పుకుంటానని స్పష్టం చేశారు. ‘ప్రజా సంకల్ప యాత్ర’ పేరిట పాదయాత్ర చేపట్టిన జగన్ కడప జిల్లాలో ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ టీడీపీ ఆరోపణలపై స్పందించారు.

‘15 రోజులు టైం ఇస్తున్నా. తీసుకోండి. నాకు విదేశాల్లో ఒక్క రూపాయి ఉందని నిరూపించినా నేను రాజకీయాలనుంచే తప్పకుంటా. రుజువు చేయలేకపోతే మీరు ముఖ్యమంత్రి పదవినుంచి తప్పుకోండి’ అని జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సవాల్ విసిరారు. జగన్ దగ్గర విదేశాల్లో డబ్బు ఉంటే… నంద్యాల ఉప ఎన్నికల్లో ఎందుకు ఓడిపోతామని ఆయన ప్రశ్నించారు. ‘నంద్యాలలో ఓటుకు రూ.  6000 నుంచి 10 వేలు ఇచ్చింది ఎవరు.. నువ్వా నేనా? ఎమ్మెల్యేలను సంతలో గొర్రెలను కొన్నట్టు వందల కోట్లు ఇచ్చి కొన్నారు. నల్లధనం మీదగ్గర ఉందా నాదగ్గరా..’ అని జగన్ వ్యాఖ్యానించారు.

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికకోసం ఎమ్మల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియోలో దొరికిపోయింది నీవు కాదా? అని ప్రశ్నించిన జగన్, ‘చేసేటివన్నీ వెధవ పనులు.. చెప్పేవి శ్రీరంగ నీతులు’ అని ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. తానేదైనా కార్యక్రమం తలపెట్టినప్పుడు.. ఏదో ఒక పత్రికలో ఒక కథనం రాయించి దాన్ని తోక పత్రికలలో హైలైట్ చేయిస్తారని జగన్ ఆరోపించారు.

నంద్యాల ఎన్నికల సందర్భంగా రిపబ్లిక్ టీవీలో వచ్చిన కథనాన్ని జగన్ గుర్తు చేశారు. నంద్యాలలో ముస్లిం సోదరులు ఎక్కువగా ఉంటారు కాబట్టి… వారిని గందరగోళ పరచడానికే జగన్ బీజేపీతో కలుస్తున్నాడంటూ రిపబ్లిక్ టీవీలో ఒక కథనాన్ని ప్రసారం చేయించారని ఆరోపించారు. ‘ఇలాంటి కథనాలు చూస్తే నాకు ఆశర్చం… అసలు బీజేపీతో కలసి పని చేస్తున్నది ఎవరు? కేంద్ర ప్రభుత్వంలో ఎవరున్నారు?’ అని జగన్ ప్రశ్నించారు. ‘ఆ కథనానికి కారణం ఏమిటంటే.. నంద్యాల ఎన్నికలే! అక్కడ 60 వేల మందిముస్లిం సోదరులున్నారు. వారిని దూరం చేయాలన్న లక్ష్యంతో ఆ వార్త రాయించారు’ అని జగన్ ఆరోపించారు.

Related posts

Leave a Comment