ప్రజల వ్యక్తిగత సమాచారం వెల్లడి
ట్రిబ్యూన్’ పరిశోధనలో తేలిగ్గా దొరికిన ఆధార్ సమాచారం
పదే పది నిమిషాల్లో అపరిమితమైన యాక్సెస్
యుఐడిఎఐ చెబుతున్న భద్రతలో డొల్లతనం
ఆధార్ సమాచారం చాలా భద్రం... యునీక్ ఐడెంటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) నుంచి సమాచారం లీకవడం అసాధ్యం... ఎవరూ ఆ సమాచారాన్ని చూడలేరు... కేంద్ర ప్రభుత్వం, యుఐడిఎఐ పదే పదే వల్లె వేస్తున్న మంత్రాలివి. అయితే, ఆచరణలో ఆందోళనకరమైన... భీతిగొల్పే స్థాయిలో ప్రజల సమాచారం లీకవుతోంది. కేవలం రూ. 500 చెల్లిస్తే 100 కోట్లకు పైగా ప్రజల ఆధార్ అకౌంట్లలోని వివరాలను తెలుసుకోవచ్చు. పేరు, అడ్రస్, ఫొటో, ఫోన్ నెంబర్, ఇమెయిల్ వంటి వ్యక్తిగత వివరాలన్నీ చూడొచ్చు. మరో రూ. 300 చెల్లిస్తే ఆధార్ కార్డులను ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఆశ్చర్యమనిపించినా ఇది నిజం.
ఎవరూ ఊహించనంత తేలిగ్గా అనధికారికంగా ఆధార్ సమాచారాన్ని సొంతం చేసుకునే అవకాశం ఉందని ‘ట్రిబ్యూన్’ పత్రిక నిరూపించింది. జలంధర్ లో ట్రిబ్యూన్ ప్రతినిధి ఒకరు చేసిన ఓ చిన్న ప్రయోగం షాకింగ్ నిజాన్ని బయటపెట్టింది. ఒక అపరిచితుడు వాట్సాప్ గ్రూపు ద్వారా ట్రిబ్యూన్ ప్రతినిధికి ఆఫర్ ఇచ్చాడు. పేమెంట్ అప్లికేషన్ పేటీఎం ద్వారా రూ. 500 చెల్లించిన ట్రిబ్యూన్ ప్రతినిధికి 100 కోట్లకు పైగా అకౌంట్లు ఉన్న ఆధార్ డేటాలోకి అపరిమితమైన యాక్సెస్ కల్పించాడు.
ట్రిబ్యూన్ కరెస్పాండెంట్ ‘అనామిక’ పేరిట ఒక ఏజెంట్ తో వాట్సాప్ చాటింగ్ చేశారు. 7610063464 నెంబర్ తో ఉన్న వాట్సాప్ అకౌంట్ ద్వారా చాటింగ్ చేసిన ఆ వ్యక్తి తనను ‘అనిల్ కుమార్’ అని పరిచయం చేసుకున్నాడు. ట్రిబ్యూన్ ప్రతినిధిని పేరు, ఇ మెయిల్ ఐడి, మొబైల్ ఫోన్ నెంబర్ వంటి వివరాలు అడిగిన అనిల్, 7610063464 నెంబర్ తోనే ఉన్న పేటీఎం అకౌంట్ కు రూ. 500 జమ చేయాలని సూచించాడు. డబ్బు చెల్లించగానే లాగిన్ ఐడి, పాస్ వర్డ్ పంపాడు. ఒక ఆధార్ నెంబర్ ను టైప్ చేయగానే అందుకు సంబంధించిన వ్యక్తి యుఐడిఎఐకి సమర్పించిన సమస్త సమాచారాన్ని పొందే అవకాశం ట్రిబ్యూన్ కరెస్పాండెంట్ కు ఈ ‘గేట్ వే’ ద్వాారా లభించింది. డబ్బు చెల్లించిన పదే పది నిమిషాల్లో ఆధార్ డేటా కళ్ల ముందు ప్రత్యక్షమైంది.
మరో రూ. 300తో సాఫ్ట్ వేర్
ట్రిబ్యూన్ కరెస్పాండెంట్ మళ్లీ ఏజంట్ అనిల్ కుమార్ ను సంప్రదించాడు. ఈసారి ఆధార్ కార్డుల ప్రింట్లు కావాలని అడిగారు. ఈసారి 8107888008 పేటీఎం నెంబర్ కు రూ. 300 చెల్లించాలని అతను సూచించాడు. రూ. 300 చెల్లించగానే 7976243548 నెంబర్ నుంచి సునీల్ కుమార్ అనే పేరుతో ఓ వ్యక్తి కాల్ చేశాడు. టీమ్ వ్యూయర్ ద్వారా చూస్తూ ట్రిబ్యూన్ కరెస్పాండెంట్ కంప్యూటర్ లో సాఫ్ట్ వేర్ ను ఇన్ట్సాల్ చేశారు. పని ముగియగానే సాఫ్ట్ వేర్ డ్రైవర్లను డిలీట్ చేశారు.
ఇదేదో అరుదుగా జరిగిన లీక్ కాదు. ప్రణాళికా బద్ధంగా నిర్మించిన రాకెట్ ఒకటి... ఆధార్ డేటాను అమ్ముకుంటోంది. దీనిపై చండీగఢ్ లోని యుఐడిఎఐ అధికారులను ట్రిబ్యూన్ ప్రతినిధులు సంప్రదించినప్పుడు.. పూర్తి డేటాకు యాక్సెస్ ఉండటం చూసి వారు షాకయ్యారు. ఇది జాతీయ భద్రతకే ముప్పు అని ఆ అధికారులు భావించారట. వారు వెంటనే బెంగళూరులోని యుఐడిఎఐ సాంకేతిక నిపుణులను సంప్రదించారు.
చంఢీగడ్ లోని యుఐడిఎఐ ప్రాంతీయ కేంద్రపు అదనపు డైరెక్టర్ జనరల్ సంజయ్ జిందాల్ దీనిపై స్పందిస్తూ... ఇదో లోపమని అంగీకరించినట్టు ట్రిబ్యూన్ తెలిపింది. ‘డైరెక్టర్ జనరల్, నేను మినహా పంజాబ్ లో మూడో వ్యక్తికి ఎవరికీ మా అధికారిక పోర్టల్ కు యాక్సెస్ లేదు. ఎవరైనా చొరబడితే అది చట్టవిరుద్ధమే. అంతేకాదు.. అది జాతీయ భద్రత పరంగా పెద్ద ఉల్లంఘనే’ అని జిందాల్ చెప్పారు.
లక్ష మందికి యాక్సెస్
ఆధార్ డేటా రాకెట్ ఆరు నెలలనుంచి పని చేస్తున్నట్టు తమ పరిశోధనలో వెల్లడైందని ‘ద ట్రిబ్యూన్’ పేర్కొంది. వాట్సాప్ లో అజ్ఞాత గ్రూపులను ప్రారంభించి మూడు లక్షల గ్రామ స్థాయి ఎంట్రప్రైజెస్ (వి.ఎల్.ఇ) ఆపరేటర్లను టార్గెట్ చేశారు. ఈ విఎల్ఇలను గతంలో కేంద్ర ఎలక్ట్రానిక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నియమించింది. కామన్ సర్వీస్ సెంటర్ల పథకం (సి.ఎస్.సి.ఎస్)లో భాగంగా వారి నియామకం జరిగింది. ఆధార్ కార్డుల జారీ బాధ్యత నిర్వర్తించినంతకాలం వారికి పని ఉంది. సమాచార లీకేజీని అరికట్టడానికి ఆధార్ బాధ్యతను పోస్టాఫీసులకు, కొన్ని బ్యాంకులకు పరిమితం చేసిన తర్వాత విఎల్ఇలు ఖాళీగా ఉన్నారు. వారికి ఈ రాకెట్ ఆధార్ డేటాను సమకూర్చినట్టు భావిస్తున్నారు. లక్ష వరకు విఎల్ఇలు అక్రమంగా ఆధార్ సమాచారాన్ని పొందినట్టు అనుమానిస్తున్నారు.