రామోజీరావుతో జగన్ భేటీ..

3 0
Read Time:5 Minute, 29 Second

పాదయాత్రకు ముందు సహకారం కోసమేనా?

రాజకీయ వైఖరుల్లో తూర్పు, పడమరలా కనిపించే… వ్యాపారంలోనూ ప్రత్యర్ధులైన ఇద్దరు ప్రముఖులు కలిస్తే అది కచ్చితంగా హాట్ టాపిక్ అవుతుంది. ఈనాడు పత్రికాధిపతి రామోజీరావును ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కలవడమూ సరిగ్గా ఇలాంటి చర్చకు దారి తీసింది. జగన్మోహన్ రెడ్డి కేవలం రాజకీయ నాయకుడే కాదు..ఈనాడు పోటీ పత్రిక సాక్షికి అధిపతి (ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా) కూడా. సోమవారం సాయంత్రం జగన్మోహన్ రెడ్డి రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళి చాలాసేపు భేటీ వేశారు. నవంబర్ 2వ తేదీనుంచి రాష్ట్రమంతటా జగన్ పాదయాత్ర చేపట్టిన నేపథ్యంలో రామోజీరావు సహకారం కోరుతూ కలిశారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మీటింగ్ ఇంతవరకే పరిమితమా? అంతకు మించిన ప్రాధన్యతేమీ లేదా?

గతంలో ఉప్పు, నిప్పులా ఉన్న వీరిద్దరూ కలవడం ఇదే మొదటిసారి కాదు. రెండేళ్ళ క్రితమే ఓసారి జగన్ వ్యక్తిగతంగా రామోజీరావును కలిశారు. అంతకు ముందే ఒక పెళ్ళిలో పలకరింపులు పూర్తయ్యాయి. తొలి భేటీ తర్వాత.. రామోజీరావు మనుమరాలి పెళ్ళికి జగన్మోహన్ రెడ్డినీ ఆహ్వానించారు. ఏదో వెళ్ళి అక్షింతలు వేసి వచ్చామా… అన్నట్టు కాకుండా జగన్ కాస్త సన్నిహితంగానే మసులుకున్నారు. ఈ రెండేళ్ళ పరిణామాలు అంతకు ముందు దశాబ్దాల సంబంధాలకు పూర్తి భిన్నంగా కనిపించాయి.

రాజకీయంగా రామోజీరావు తొలినుంచీ కాంగ్రెస్ వ్యతిరేకతను బహిరంగంగానే చాటుకోగా.. జగన్ తండ్రి వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక అది మరింత ప్రస్ఫుటమైంది. రామోజీరావు వ్యాపార సామ్రాజ్యాన్ని, ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టడానికి వైఎస్ గట్టి ప్రయత్నాలే చేశారు. తాత్కాలికంగా ఇబ్బందులు వచ్చినా రామోజీరావు తట్టుకొని నిలబడ్డారు. వైఎస్ మరణం తర్వాత కూడా జగన్, రామోజీ గ్రూపు మధ్య సఖ్యత లేదు. ఈనాడు, సాక్షి రాజకీయాంశాలపైనా, సంస్థల ఆర్థికాంశాలపైనా పరస్పరం దుమ్మెత్తిపోసుకునేవి. రాష్ట్ర విభజన తర్వాత క్రమేపీ మార్పులు రావడం మొదలైంది.

విభజన తర్వాత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు, రామోజీరావు మధ్య దశాబ్దాల అనుబంధం ఉన్నా… ఇటీవలి కాలంలో ఈనాడు పూర్తి స్థాయిలో అంటకాగినట్టు ఉండటంలేదు. చంద్రబాబు ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న ప్రతికూల అభిప్రాయాలకు కూడా ఈనాడు అడపాదడపా చోటిస్తోంది. దీనికంటే ముందే… రామోజీరావు-జగన్, ఈనాడు-సాక్షి సయోధ్యకు బీజాలు పడ్డాయి.

మొదటి పత్రికల పరంగా వైరి వైఖరిని విడనాడాలని నిర్ణయించుకున్నారు. తర్వాత రాజకీయంగానూ వైరి వైఖరిని అనుసరించాల్సిన అవసరం లేదన్నట్టుగా వ్యవహరిస్తూ వచ్చారు. ఇప్పుడు సందర్భానుసారం కలుసుకునేవరకు సంబంధాలు మెరుగుపడ్డాయి. ఇప్పడు రామోజీరావుకు చంద్రబాబు ఎంతో జగన్ కూడా అంతే!

గతంలో మాదిరిగా ఈనాడు పత్రిక జగన్ కేేసులను అసాధారణంగా హైలైట్ చేయడంలేదు. రాజకీయ సందర్భాల్లో తెలుగుదేశానికి ఏకపక్షంగా రాయడంలేదు. మనసులో ఏమున్నా.. కవరేజ్ విషయంలో ఈనాడు సంయమనం పాటిస్తోంది. ఎన్నికల సందర్భాల్లో సైతం ఈ తాజా ధోరణి స్పష్టమైంది. నంద్యాల ఎన్నికల సందర్భంగా ఈనాడు కవరేజ్ తటస్థంగా ఉందని వైసీపీ వర్గాలు భావించాయి.

ఈ నేపథ్యంలో… సోమవారంనాటి రామోజీ ఫిల్మ్ సిటీ భేటీ కాలక్రమంలో వస్తున్న మార్పులకు సూచికగా నిలిచింది. సోమవారమే… జగన్ పై ఉన్న కేసుల విచారణలో వ్యక్తిగత హాజరునుంచి మినహాయించడానికి సీబీఐ కోర్టు నిరాకరించింది. ఈ విషయం కూడా రామోజీరావుతో భేటీలో చర్చకు వచ్చినట్టు సమాచారం.

సోమవారం రామోజీరావును కలసి సహాకరం కోరిన జగన్, మంగళవారం టీవీ ఛానళ్ళ సీఈవోలను సమావేశానికి ఆహ్వానించారు.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
50 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
50 %

Leave a Reply