పారడైజ్ పేపర్లలో జగన్మోహన్ రెడ్డి పేరు

6 0
Read Time:3 Minute, 30 Second

పన్ను ఎగవేత ద్వారా సొమ్ము దాచుకోవడానికి స్వర్గధామాలుగా భావించే దేశాలు, దీవుల్లో జరుగుతున్న లావాదేవీల రహస్యాలను ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుల అంతర్జాతీయ కన్షార్షియం (ఐసిఐజె) మరోసారి బద్ధలు కొట్టింది. తాజాగా ‘పారడైజ్ పేపర్ల’ పేరిట ఏకంగా కోటీ 34 లక్షల రికార్డులను బహిర్గతం చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుయాయులనుంచి బ్రిటన్ రాణి వరకు ప్రపంచ స్థాయి నేతల పేర్లు అందులో ఉన్నాయి.

ఇండియాకు సంబంధించినంతవరకు 714 పేర్లు ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పేరు అందులో చోటు చేసుకుంది. సన్ గ్రూపునుంచి మన రాష్ట్రానికే చెందిన జీఎంఆర్ వరకు ఆఫ్ షోర్ స్వర్గధామాల్లో లావాదేవీలు నెరిపినట్టు ఐసిఐజె తేల్చింది. పారడైజ్ పేపర్లలో పేర్లున్న ఇండియన్లు చాలావరకు కార్పొరేట్లు, కంపెనీల ముఖ్యులే. వారిలో కొంతమంది ఇప్పటికే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులను ఎదుర్కొంటున్నారు. అలాంటి పేర్లలో ఒకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.

జగన్మోహన్ రెడ్డిపై సీబీఐ కేసుకు సంబంధించి తాజా ఆర్థిక సంబంధాల ప్రస్తావన పారడైజ్ పేపర్లలో ఉన్నట్టు ఇండియన్ ఎక్స్ ప్రెస్ పేర్కొంది. సన్ టీవీ, ఎయిర్ సెల్ – మాక్సిస్ కేసు, ఎస్సార్- లూప్ 2జి కేసు తదితర అంశాలు కూడా పారడైజ్ పేపర్లకు ఎక్కాయి. ఐసిఐజె సేకరించిన కోటీ 34 లక్షల రికార్డులలో ఎక్కువ భాగం బెర్ముడా లా కంపెనీ ‘యాపిల్ బై’ నుంచి వచ్చాయి. అందులో ఇండియాకు సంబంధించి ఇంకా రాజస్థాన్ అంబులెన్స్ కుంభకోణం వివరాలు, చివరికి 2జీ కేసుకు సంబంధించి ’యాపిల్ బై’కు సీబీఐ పంపిన లెటర్స్ రొగేటరీ కూడా ఉన్నాయి.

కేంద్ర విమానయాన శాఖ మంత్రి జయంత్ సిన్హా పేరు కూడా రికార్డులకెక్కింది. దీనికి కారణం.. ఒమిడ్యార్ నెట్ వర్క్ అనే సంస్థతో గతంలో ఆయనకు ఉన్న బంధమే. బిజెపి ఎంపీ, సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ (ఎస్ఐఎస్) వ్యవస్థాపకుడు అయిన ఆర్.కె. సిన్హా, కార్పొరేట్ లాబీయిస్ట్ నీరా రాడియా, సంజయ్ దత్ భార్య పూర్వపు నామం దిల్ నషీన్ పారడైజ్ పేపర్లలో ఉన్నట్టు సమాచారం. బెర్ముడా కంపెనీలో సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ షేర్ హోల్డింగ్ వంటి వివరాలూ పారడైజ్ పేపర్లలో చోటు చేసుకున్నాయి.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
25 %
Surprise
Surprise
75 %

Leave a Reply