నవంబర్ 10వ తేదీనుంచి జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నిర్ణయించింది. గత ఎన్నికల్లో తమ పార్టీ తరపున గెలిచి అధికార పార్టీలోకి చేరిపోయిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేవరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని నిశ్చయించుకుంది. వైసీపీ శాసనసభా పక్షసమావేశం ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జరిగింది.
నవంబర్ 6వ తేదీనుంచి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయనున్న నేపథ్యంలో.. గురువారం శాసనసభా పక్షంతోనూ, ఇతర ముఖ్య నేతలతోనూ జగన్ సమావేశమయ్యారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని, మంత్రివర్గంలో చేరిన నలుగురిని భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రజలవద్దకే వెళ్ళాలని జగన్ అభిప్రాయపడ్డారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు, మంత్రులపై చర్యలు తీసుకునేవరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదన్న అభిప్రాయాన్ని ఎమ్మెల్యేల ఎదుట పెట్టిన జగన్.. వారి ఆమోదంతో నిర్ణయాన్ని ప్రకటించారు.
ఈమేరకు వైసీపీ శాసనసభా పక్షం చేసిన తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు, రాష్ట్రపతి, గవర్నర్ లకు పంపాలని, జాతీయ మీడియాలో ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎంత అప్రజాస్వామికంగా ఉందో దేశం మొత్తానికి తెలియాలని జగన్ పేర్కొన్నారు. గతంలో ఎన్టీఆర్ శాసనసభా సమావేశాలను బహిష్కరించిన విషయం గుర్తు చేసుకున్నారు. తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రి జయలలిత కూడా ఓ టర్మ్ లో అదే చేశారని పేర్కొన్నారు.
ఫిరాయింపులను ప్రోత్సహించే అధికార పక్షం ఓవైపు ఉంటే.. ఆ ఫిరాయింపులను ఆమోదించినట్టుగా ప్రతిపక్షం కూడా సభలో కొనసాగడం అనవసరమనే అభిప్రాయాన్ని జగన్ వ్యక్తం చేశారు. పార్టీ మారిన 21 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. వారిలో నలుగురిని మంత్రివర్గంలోకి తీసుకోవడం అధికార పక్షం అప్రజాస్వామిక వైఖరికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.
ఫిరాయించిన ఎమ్మెల్యేలు మా లెక్కలోనా?
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అసెంబ్లీ రికార్డుల్లో వైసీపీ సభ్యులుగా చూపించడాన్ని ఆ పార్టీ శాసనసభా పక్ష ఉప నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్పు పట్టారు. వైసీపీకి 66 మంది సభ్యులు ఉన్నట్టు చూపుతున్నారని, మంత్రివర్గంలో చేరినవారిని కూడా తమ పార్టీ జాబితాలో చూపితే ప్రతిపక్షం ప్రభుత్వంలో చేరిందా.. అన్న అభిప్రాయం కలుగుతోందని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు శాసనసభా సమావేశాలను మొక్కుబడిగా మార్చేశారని పెద్దిరెడ్డి దుయ్యబట్టారు. గత మూడున్నరేళ్ళలో కేవలం 80 రోజులు మాత్రమే సభను నిర్వహించారని, గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్ళలో 256 రోజులు సభ జరిగిందని చెప్పారు.